Balanagamma is a great Story
BALANAGAMMA శ్రీకరము-శోభస్కరము సుప్రసిద్ధము అగు నూరుఆమడల విస్తీర్ణం గల భూచక్ర పట్టణ సామ్రాజ్యాన్ని నవభోజరాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పట్టపురాణి భూలక్ష్మీదేవి. ఆదంపతుల సుగుణసంప దలకు కొదవలేదు. కాని వారికి సంతానము లేదు. అందుకు వారు మ్రొక్కని దేవుళ్ళు, తిరుగని క్షేత్రాలు లేవు. భూలక్ష్మీదేవి తమ రాజ్యానికి పన్నెండు ఆమడల దూరంలో గల పర్వతంపై జటంగముని అనబడు మహామునిని గురించివిన్నది. భర్త అనుజ్ఞ తీసుకొని జటంగముని దర్శనానికి వెళ్ళింది. సంతానలేమిని విన్నవించుకుంది. సంతానప్రాప్తి కలిగేలా ఆశీర్వదించ మున్నది. ముని మనోనేత్రముతో పరిశీలించాడు. ఆడబిడ్డ పుడితే తల్లికి గండము, మగబిడ్డ పుడితే తండ్రికి గండము అని గ్రహించాడు.

అమ్మా లక్ష్మీదేవీ! నీకు సంతానము అనుగ్రహించడం నా చేత కాదు. నీకు సంతానము కలిగే ఉపాయము చెబుతానువిను. ఈశాన్య మూలను యోగమునీంద్రుని గట్టు ఉన్నది. ఆ గట్టున మద్దిమానులున్నవి. ఆ మానుల నడుమ పుట్ట ఉన్నది. పుట్టమీద బాలమామిడి చెట్టు ఉన్నది. ఆ చెట్టున పళ్ళు విరగకాచి ఉన్నవి. పుట్టకు చెట్టుకు దణ్ణం పెట్టుకొని చెట్టున గల పళ్ళు ఏడుకోసుకొని నీ పట్నం వెళ్ళు. ఉదయాన స్నానము. చేసి ఏడు పళ్ళు రసమును తీసి త్రాగు. సంతానం కలుగుతుంది. నీకొక రహస్యము. ఆపుట్టలో శేషుడున్నాడు. ఆయన నీకుఫలాన్ని కలుగ జేస్తాడో లేదో తెలియదు. అని చెప్పి ఆమెను సాగనంపాడు జటంగముని.
లక్ష్మీదేవి అరణ్యమార్గాన యోగమునీంద్రుని గట్టుకు బయలు దేరింది. దారిలో కొందరు విప్రులు కనబడి ఆమెను యోగ మునీంద్రుని గట్టుకు చేర్చి అంతర్ధాన మయ్యారు. బాలమామిడి చెట్టును చూచింది. దణ్ణం పెట్టుకున్నది. పుట్టమీది బాల మామిడిచెట్టు ఎక్కింది. ఒడినిండా పళ్ళు కోసుకుని క్రిందకు దిగింది. ఒడిలో ఏడు పళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరల చెట్టును ఎక్కింది. మరిన్ని పళ్ళు కోసింది. దిగిచూస్తే ఏడు పళ్ళే ఉన్నాయి. మళ్ళీ చెట్టును ఎక్కింది కోసింది. దిగి చూసుకున్నది కదా! ఏడుపళ్ళేఉన్నాయి. ఇంతేప్రాప్తంఅనుకొని మనస్సు సరిపెట్టుకుంది.
కాలనాగుడు ఏడుచుట్లు తిరిగి కొమ్మలపైకొచ్చి ఈ తోటకు నేను కావలిని నాకు తెలియక పుట్టనెక్కిన నిన్నుకాటువేసెదనని బుసకొట్టేడు. భూలక్ష్మీ గడగడ వణికింది. సంతానకాంక్షతో తొందరపడ్డాను. క్షమించు నన్నిప్పుడు చంపుట పాడికాదు. నాకు బిడ్డలు పుట్టిన తొమ్మిది నెలలకు శేష పౌర్ణమికి నా మేడకు వస్తే కాటు ఇస్తానన్నది. అప్పటికి బిడ్డల మీద మోహము తీరక కాటివ్వవేమో అని కాలనాగు అడుగగా- మాట దప్పను, కాటిస్తాను తప్పక రావలసిందన్నది. భూలక్ష్మీ నీకు ఏడుగురు ఆడ పిల్లలు కలుగుతారు కడగొట్టు బాలకు BALANAGAMMA అని నా పేరు పెట్టు అనగా ఆమె స్వామీ ఒక్క బిడ్డనైనా మగబిడ్డనియ్యి . ఇంటి పేరు నిలబెట్టు అని ప్రార్థించింది. భూలక్ష్మీ మగబిడ్డ కలిగితే నీ పెనిమిటికి ప్రాణగండము అని పలుక భర్తలేని బ్రతుకు నాకేల అట్లే కానిమ్ము అని సరిపెట్టుకున్నది.
వెంటనున్న మంది మార్బలముతో రాజవాసానికి చేరుకున్నది. ఆమెకు సైనిక సామంత దాసదాసీజనము స్వాగతం పలికేరు. దశమి సోమవారం బావివద్ద సూర్యస్నానం చేసింది. బంగారు గిన్నెలో ఏడు మామిడి పళ్ళును పిండుకొని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తలచుకొని, ఆచూతరసాన్ని గడగడ త్రాగింది. కొన్ని నాళ్ళకు చూలింతయ్యింది. నెలలు నిండాయి. నొప్పులు అధికమయ్యాయి. దేశంలోని నూర్గురు మంత్ర సానులను నియోగించాడు. రాజువరుసగా భూలక్ష్మీదేవి ఏడు గురు బిడ్డలను ప్రసవిం చింది. విప్రులను పిలిచి నామకరణం చేశారు. పెద్దామె సూర్యనాగమ్మ, రెండవ బిడ్డ చంద్రనాగమ్మ, మూడవ బిడ్డ ఉత్తర కన్య, నాల్గవది దక్షిణకన్య, అయిదవ బిడ్డ పగడాల నాగమ్మ, ఆరోవబిడ్డ మునికన్య, ఏడవ కూతురు BALANAGAMMA , బిడ్డలందరు దినదిన ప్రవర్థ మానంగా పెరుగు తున్నారు. మురిపె మొప్ప బిడ్డలకు దుస్తుల కూర్చి నారు. నగలు చేయించి నారు. ఇలా ఎనిమిది నెలలు గడిచిపోయినవి.
తొమ్మిదవ నెలలో ఒక విప్రుడు రాగా వానిని రాణి శేషవర్ణ పౌర్ణ మెప్పుడని ప్రశ్నించింది. మరిమూడురోజులన్నాదని విప్రుడు చెప్పేడు. ఇంక తనకు మూడు రోజులే ఆయువని మూర్ఛపోయింది భూలక్ష్మి. అంతఃపురం తల్లఃడిల్లిపోయింది. మహారాజు దగ్గరకు తీసుకున్నాడు. నాధా! నేటి వరకు మీకు చెప్పలేదు నాకింక మూడురోజులే ఆయువు. మామిడి చెట్టుకు కాపున్న నాగుడు నన్ను కాటువేసెదనని శపించాడు. నాబిడ్డలు తల్లిలేనివారు కారాదు పెదతల్లి, పినతల్లి, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరూ గాని వారినిచూచేవారు లేరు. మీరు వాళ్ళకు పెళ్ళి పేరంటములు చేసేవరకు మారుమనువాడ వద్దని విన్నవించుకున్నది.
మహారాజు మంత్రి సామంతులను పిలిచి కాలనాగుడు రాణిని కాటువేయుటకు రానున్న సంగతిని చెప్పి దురపిల్లేడు. తమరిలా బేల పోవడం తగదు మహారాజా పాముని నిరోధించుట ఏమంత కష్టసాధ్య మైన పనికాదని చెప్పి యోచన చేసి ఏడునిలువులు స్తంభమును నాటి, దానిపై దూలములను ఏర్పరచి, ఒక పెట్టెను వ్రేలాడగట్టి ఆపెట్టెలో బంగారు మంచమును పాదుకొల్పి ఆ మంచాన మహారాణీ వారిని ఉంచి ఈ పెట్టెను స్తంభమునకు వ్రేలాడగట్టి కంభము చుట్టూ త్రవ్వించి, మంటలు వేయించి వెలుపల కావలి వారలను కాపుంచి చుట్టును గల పురవీధులందు వాడిశూలములు నాటించి కోటగుమ్మమున విచ్చుకత్తుల పహారా పెట్టేరు. దాని ప్రాంతమున సదానృత్యములతో భారత భాగవత పురాణ శ్రవణము లందు తెలివిగా ఉండెదము. రాణివారిని పామేమి చేయగలదు అని పల్కి ఆ ప్రకారముగ యేర్పాటు చేశారు.
నాగేంద్రుడు ఇదంతా గ్రహించుకొని పుట్ట విడిచి భూచక్రపట్నం చేరుకున్నాడు. చేసిన యేర్పాట్లన్నీ చూశాడు. మాయమై స్థంబాల మొద టకు చేరుకున్నాడు. అక్కడ మాయమై తొట్టె వద్దకు చేరుకున్నాడు. వద్దు భూలక్ష్మి మాట తప్పవద్దు అన్న నాగేంద్రునకు నమస్కరించింది. బిడ్డలను తల్చు కున్నదిమూర్చపడిపోయినది. సమయం మించి పోయిందని రాజు బలంగం తొట్టికి చేరుకున్నారు. రక్తం మడుగుచూచి రాజు కైజారు గుండెల గ్రుచ్చు కొనబోయాడు. మహారాజా మీరింత సాహసం చేయవల సిన పనిలేదు. మహారాణిగారు బ్రతికే ఉన్నారు. పాముకాటు విషానికి సోమ్మసిల్లి ఉన్నారు. కలవర పడకండి అని మహామంత్రి రాజుగారిని ఊరడించాడు. దేశంలో పాము మంత్రగాళ్ళను పిలిపించాడు. వచ్చిన
మంత్రగాళ్ళను చూసిందిరాణి భూలక్ష్మీదేవి. మహనీయులారా నన్ను బ్రతికించాలను కోవడం వృధా ప్రయాస. నాగరాజుకు నేనువాగ్దానం చేశాను. ఆయన దయ తలచి నేను కోరిన తడవుకు వచ్చి కాటు వేశాడు. ఈ విషం విరిగేది కాదు శ్రమపడకండి అన్నది.భర్త నవాభోజరాజును చేరబిల్చింది. మహారాజా! ఓ! నా ప్రాణ వల్లభా విచారించకండి పిల్లలు అన్నెం పున్నెం యెరుగని పసికూనలు, వాళ్ళను జాగ్రత్తగా చూడండి. ప్రభూ పెళ్ళి అసక్తిని మానండి. సవితి తల్లి బిడ్డలను పరిపూర్ణంగా ప్రేమించడం, లాలించడం జరుగని వ్యవహారం. మీకు పెళ్ళిపై మనసైతే మీరు నా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను అత్తవారిళ్ళకు సాగనంపి పెళ్ళి చేసుకోవలసింది. ఇంకనాకు శెలవివ్వండి, అని భూలక్ష్మీదేవి కన్నుమూసింది.
రాజు, మంత్రులు, భటుల, దాసీలు, దాయాదులు, హితసన్నిహితులుఅందరూ కన్నీరుమున్నీరుగా శోకించారు. పిల్లలు ఏడుగురు తమతల్లి బంధువర్గం ఇంటికి వెళ్ళిందనుకున్నారు. రాజు ద్వితీయ వివాహం రాణికి ఇచ్చిన మాట ప్రకారం నవాభోజరాజు బిడ్డలు ఏడుగుర్ని ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు. ఒకనాడు మంత్రులు పురోహితులు రాజును సమీపించి ద్వితీయవివాహం చేసుకోవలసిందిగా సూచించారు. రాజు అందుకు అంగీకరించలేదు. పిల్లలచేత చెప్పిస్తే నవాభోజరాజు వింటారని ఆలోచించారు. బిడ్డలకు చెప్పి వారిని తమ తండ్రిని వివాహం చేసుకోమని, తమకు తల్లిలేని లోటు తీర్చమని చెప్పవలసిందిగా బోధించారు. ఎవరు చెప్పేరమ్మా మీకీ మాట.
మీ అమ్మ నన్ను మారుపెళ్ళి చేసుకోవద్దని చెప్పింది. నన్ను బలవంత పెట్టకండి. తండ్రీ ! మీ ప్రేమ మేమెరుగనిది కాదు. కాని మీరొక విషయాన్ని మరచిపోతున్నారు. మేము ఆడపిల్లలము మాకు మరుగు ఉంటుంది. మగవారు మీరు, మాకు మరొక తల్లి ఉంటే తరుగు మరుగులు ప్రేమాభిమానాలు గొప్పగా జరుగుతాయన్నారు. అయినా రాజు మీరు చిన్న పిల్లలు మీకేమి లోటు రాకుండా దాసీదాసీలను పెట్టి పోషించుగల వాడను నేను, మీరు మీ ఆలోచనలను మానండి. అని వారిని ఊరడించి వారి వారి గదులకు పంపించివేశాడు. మరల మరల మంత్రులు బాలలచే అడిగిస్తూ ఉండేవారు. పసికందులు మీకేమి తెలుసునమ్మ? నేను మరియొక ఆమెను పెండ్లాడవలెనన్న మీ అమ్మ వంటి యామె దొరుకునటమ్మా? అని వారిని మభ్యపెడుతూ ఉండేవారు.
క్రమక్రమంగా రాజు మనస్సులో వివాహంపట్ల మక్కువ కలుగుతుండడం మంత్రులు గ్రహించారు. కన్యా న్వేషణకు విపులను పంపించారు. వారు దేశదేశాలు తిరుగుతూ నమన వారి పట్నం చేరుకున్నారు. ప్రభువు దవళరాజును కలుసు కున్నారు. ఆరాజు కూతురు మాణిక్యాల దేవిని తమ నవాంభోజ రాజుకు స్థిర పర్చేరు. ఎనిమిదవరోజు శుభతిదియైనందున వివాహలగ్నం నిర్ణయించి తరలి వెళ్ళేరు. మాణిక్యాలదేవి నవాంభోజరాజు వివాహం అత్యంత వైభవ ముగా జరిపించారు.కాపురానికి వచ్చిన మాణిక్యాలదేవి బిడ్డలను చూచింది. అక్కున చేర్చుకున్నది. దినదినం బాలలను స్నానపానాదుల జాగ్రత్తగా చూస్తూ వాళ్ళను ఆదరిస్తూండేది. పిల్లలు కూడా ఆమె ప్రేమాభిమానాలకు మచ్చికయ్యేరు.
కప్పం కట్టడానికి ఢిల్లీ ప్రయాణం
ఢిల్లీ రాజులకు నవాంభోజరాజు కప్పం కట్టవలసిన సమయం సమీ పించినది. తన ఏడుగురు బిడ్డలను తనతో జమాబందీకి తీసుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఈ సంగతి మాణిక్యాలదేవి తెలుసు కున్నది. బాలలను తనమేడకు పిలిచింది. బిడ్డలారా మీ తండ్రి ఢిల్లీ నగరానికి జమాబందీకి వెడుతూ మిమ్ములను వెంటతీసుకు వెళ్ళాలను కుంటున్నారు. మీ తల్లిపోయి ఎక్కడకు వెళ్ళలేదు. గనుక మేము మీ వెంటరామనిచెప్పండి. ఇక్కడ యెవరివద్ద ఉంటారని అడిగితే మా పిన్ని వద్ద ఉంటామని చెప్పండి. అనిభోదించింది. తమనుఢిల్లీకి గొనిపోవుటకై పిలుచుకు వెళ్లడానికి వచ్చిన తండ్రితో బాలలు ఆవిధంగా చెప్పేరు. తండ్రి వారి అభిమతాన్ని మన్నించి మాణిక్యాలదేవి మేడకు వెళ్ళి బిడ్డలు ఏడుగుర్ని ఆమెకు అప్పగించి తాను ఢిల్లీకి వెళ్ళెను.
రాజు అటు ఢిల్లీ వెళ్లగానే మాణిక్యాలదేవి బిడ్డలను చేరబిలచి, బిడ్డలారా! నేడు పున్నమి పర్వదినము. ఈ ప్రొద్దు మీరు జాగరము చెయ్యాలి. అలాచేస్తే మీకు మంచివారు భర్తలుగా లభిస్తారు అని చెప్పింది. రెండు జాములు గడిచాక చిల్లులు పొడిచిన బిందెలు తలా ఒకటి వారి కిచ్చింది. బావికెళ్ళి నీళ్ళుతోడుకు రమ్మన్నది. ఆకలిగా ఉంది. అన్నం పెట్ట మని అడిగేరు. నేనింకా వండి వార్చలేదు. వెళ్ళి నీళ్ళు పట్టుకురండి, వాటితో స్నానము చేసి మీరు స్నానం చేయగానే మీకన్నం పెడతాను అన్నది మాణిక్యాలదేవి. వాళ్ళు బిందెలు పట్టుకొని కటికిచీకటిలో నూతికి వెళ్ళేరు. యేనాడు కష్టమెరుగనివాళ్ళు మనకిదేం ఖర్మ అని తల్లిని తలచు కొని రోదన చేశారు.
తల్లి భూలక్ష్మీదేవి కనికరించి అరటి చెట్లును కలుగచేసింది. బాలలు ఆచెట్ల అరటిపళ్ళను తిని ఆకలి బాధను తీర్చు కున్నారు. బిందెలలో నీళ్ళు తోడబోతే చిల్లులువల్ల బిందెలో నీళ్ళు నిలవలేదు. భూలక్ష్మీదేవి తన బిడ్డల బిందెలలో గుడ్డలు అడ్డంవేసింది. ఇంటికి చేరిన వాళ్ళను చూచి నూతికి వేసికొట్టిరాయేమి? బిందెలకీ చిల్లులేమియని బాలలను కర్రతో చితక్కొట్టింది. ఏడ్చిఏడ్చి గొంతెండి పోవడం వల్ల బిడ్డలు తమ తల్లిని దాహమడిగారు.
మాణిక్యాలదేవి బిడ్డలను హింసించుట
మాణిక్యాలదేవి పాలు తెచ్చింది. వాటిలో జిల్లేడుపాలు పోసింది. వసనాభి వేసింది. నల్లమందు నందులో చేర్చింది. ఏడుగిన్నెలల్లో ఆపాలు పోసి ప్లిలలకిచ్చింది. పిల్లలు గుటగుటాత్రాగేరు. త్రాగిన క్షణానికి బాలలు గుండెల్లో నొప్పి, తలలు త్రిప్పు, కళ్ళు మూతలు పడి విలవిలలాడేరు. ఇదేమిటి పిన్నీ అని వాపోయేరు. రండలారా! ముండలారా! నామీదనే నెపమా? అని కాళ్ళతో వాళ్ళను తన్నింది. తల్లిని తలచుకుని వాళ్ళు దుఃఖించారు. తన పిల్లలు త్రాగిన విషపు పాలను అమృతమయ్యేలా చేసింది తల్లి భూలక్ష్మీదేవి.
మాణిక్యాలదేవి వాళ్ళని గదిలో పెట్టి చంద్రోదయం అయిన వెంటనే లేపుతాను పడుకోవలసిందని గదికి తాళంవేసింది. గదిచుట్టూ మిరసకా యలు పోసి నిప్పులు పోసింది. బాలలకు ఊపిరాడక ఘాటుకు ఉక్కిరి బిక్కిరై ప్రాణాలుగ్గబెట్టుకొని తల్లిని తలచుకున్నారు. ఆమె మిరప ఘాటును సాంబ్రాణీ దూపంగా బాలలకు కలుగజేసింది. బిడ్డలు పినతల్లిని అన్నం పెట్టమన్నారు. ఇంకా రెండు జాముల పొద్దున్నది. తిండి తింటే ముసలి భర్తలు వస్తారు. ఓపిక పట్టండే పిల్లల్లారా నేనుకూడా వస్తాను పదండి మీ పడకటింటికి అని వాళ్ళును తీసుకు వెళ్ళి గదిలో పెట్టి తాళం వేసింది. మూడురోజులు బాలలు అన్నహారాలు లేక గదిలో సొమ్మసిల్లి పోయేరు. మేమెంత పాపం చేశాం. మాకేల ఇంతనరకం ? చిన్న మెత్త దెబ్బతగిలిన వారముకాము.

మన తల్లే ఉంటే మనకీ బాధలు కలిగేవా అని కుమిలి కుమిలి ఏడ్చారు. తల్లి భూలక్ష్మీదేవి ఆ మందిరంలో తేనెల ఊటలను కురిపించింది. వాటిని త్రాగి బిడ్డలు తేరుకున్నారు.
భూలక్ష్మీదేవి బిడ్డల బాధలను తట్టుకోలేకపోయింది. ఆమె ఆత్మ ఢిల్లీ పట్టణానికి చేరుకున్నది. భర్త వసతిలో ప్రవేశించింది. భోజరాజు వీపున తన అరచేతిని చరిచి నిద్రలేపింది. లేవవయ్యా మహరాజా బాలలను నీకప్పగించి నిశ్చింతగా కన్నులు మూసేను నేను. నీవు వాళ్ళను వదలి ఇక్కడికివచ్చేవు. వాళ్ళు అష్టకష్టాలు పడుతున్నారు అని నిద్రలేపింది.
త్రుళ్ళి పడిలేచాడు రాజు. మంత్రిని పిలిచేడు జమాబందీకి మీరు హాజరవ్వండి. నేను భూచక్రపట్నం వెళతాను అని ప్రయాణమయ్యేడు. పిల్లలకు చీరలు, బొమ్మలు నగలుకొన్నాడు. భూచక్రపట్నం చేరుకున్నాడు. పిల్లల జాడ కనబడలేదు. భార్య మాణిక్యాలదేవిని అడిగాడు. తనకు తెలియదన్నది. రాజు రాకను తెలిపే గంటలు మ్రోగాయి. అవి విన్న బాలలు మేడనుండి తొంగి చూశారు. అలికిడినివిన్నాడు. ఏరి నాబిడ్డలు- వారిని ఎక్కడఉంచేవని మాణిక్యాలదేవిని ప్రశ్నించేడు. నాకేమి తెలి యదు వాళ్ళు తల్లి భూలక్ష్మీదేవియే పిల్లలను తీసుకువెళ్లింది ఎక్కడ దాచిందో తనకు తెలియ దన్నది.
ఆమెయే పిల్లలను నిర్భందంలో ఉంచి కన్నతల్లిపైన నిందమోపు తున్నదని ఆలోచించాడు. మంత్రిని పిలిచి అంతఃపురంలోని కోట మొత్తం లోను వెదికించాడు. వాళ్ళు వెదికివెదికి గాజుల శబ్దం వినబడిన శయ్యా మందిరం తలుపులు బద్దలు కొట్టేరు. పిల్లలందరిని సేదదీర్చి తానే వారిని సంరక్షించసాగేడు మహారాజు. మాణిక్యాల దేవిని పలుకరించడం గాని, ఆమె మేడకు వెళ్లడం కాని మానుకున్నాడు మహారాజు.
కొన్నిరోజులు గడిచిపోయేయి. మాణిక్మాలదేవి తన తండ్రికి తన భర్త భోజరాజు తననుసరిగాచూడడంలేదు అని తనమేడకు రావడం లేదని, చావే తనకు శరణ్యమని వర్తమానం పంపింది. ఆమె తల్లి అడవి నుండి మూడు పసరులు తెప్పించి మూడు ఉండలు కట్టించి కూతురుకు పంపించింది. నీభర్త భోజనంలో ఒకఉండ, కూరలో ఒకఉండ, మజ్జిగలో ఒక ఉండ కలిపి నీ భర్తకు తినిపించు అతడు నీ మేడకు వచ్చితీరుతాడని వర్తమానాన్ని మాణిక్యాల దేవికి పంపించింది.
తల్లి తెలియజెప్పిన ప్రకారం ఆఉండలను అహారంలో చేర్చి తినిపించింది. ఆరాత్రి నవాభోజరాజుకు నిద్రపట్టలేదు. తాపం అతిశ యించింది. అర్థరాత్రి సమయంలో రాజుకు మాణిక్యాలదేవి పై మోహ మతిశయించింది. ఆమె మేడకు బయలుదేరేడు. రాజురాకను గ్రహించిన మాణిక్యాలదేవి తన మేడతలుపులు మూయించింది. ఓనా భామా! తలుపులు తియ్యమన్నాడు. ఆమెవినిపించుకోలేదు. బ్రతిమాలాడు. ఇంత వరకులేని ప్రేమ ఇప్పుడుకలిగిందా? నాకన్నానీకు నీబిడ్డలే కావలసిన వారు వెళ్ళు వాళ్ళను మట్టుపెట్టులేదా వాళ్ళవద్దనే ఉండవలసిందని చెప్పింది.
రాజు తన మేడకు తిరిగివెళ్ళేడు. బిడ్డలను తట్టిలేపాడు. మీ మేనమామలు ఇంటికి వెడదాం లేవండిన్నాడు నవభోజరాజు. వారు తమ తండ్రి – అమ్మ చనిపోయి నప్పుడు రానివారు- మీ వివాహానికి రానివారు, మున్నెన్నడు మేము వినని వారు వారెవరు అని ప్రశ్నించారు. గతంలో వారికి మనకు వైరమున్నందున రాకపోకలులేవు. ఇప్పుడు కలుసు కుందాం లేవండి అని వాళ్ళను పానుగంటి పురానికి బయలుదేరదీశాడు. అడవిలో పిల్లలను విడిచి వెళ్ళుటరాజు మాణిక్యాలదేవి వద్దకు వెళ్ళి భామా పిల్లలను పానుగంటి పురం వాళ్ళ మేనమామ ఇంటివద్ద విడిచివస్తాననిచెప్పేడు. నాధా మీకు అరణ్యమార్గంలో తిండి ఎలాసమకూరుతుంది అని వారికి మాణిక్యాల దేవి ఏడు రొట్టెలు కాల్పించింది.
మరొకరొట్టెను రాజుకిచ్చింది. అవి మీరు తినవద్దని చెప్పింది. అవితీసుకొని బిడ్డలను వెంటబెట్టుకొని పాను గంటి పురం దిక్కుగా అరణ్య మార్గాన బయలుదేరేడు నవభోజరాజు. మార్గములో పిల్లలు ఆకలన్నారు. అడవిలో తినడానికేమి దొరుకుతుంది. నాఈ చేతి మూటలో రాళ్ళున్నవి. అడవి మృగాలను అదిలించడానికి వీటిని మూటగట్టేను. అని రాజుబొంకేడు. అలసిఉన్నారు. ఇంకా చీకటి తొలగలేదు. మీమేన మామలను వారి ఇంటిని కనుగొనడం సాధ్యపడదు కనుక మన మిక్కడ పడుకొని తెల్లవారేక పానుగంటిపురం వెడదాం అన్నాడు.
తండ్రినవా భోజరాజు. ఒక ప్రక్క ముగ్గురు, మరొక ప్రక్క నలుగురుని పడుకోబెట్టుకొని మధ్య తను పడుకున్నాడు రాజు. వారిని నిద్రపోనిచ్చి నవాంభోజరాజు లేచి ఒక బూరుగమానను తెచ్చి బాలలమధ్య ఉంచి దానికి తలపాగా పెట్టి పిల్లలను విడిచి వెళ్ళిపోయాడు. జాము గడిచిన వెనుక బాలలు మేల్కొని తండ్రిని లేపసాగేరు. దుప్పటి తీసి చూసేసరికి తండ్రి మొద్దయి పోయెనని గొల్లుమన్నారు. ఈ అడవిలో మేమెలాగున బ్రతికేదని వాపోయేరు. ఆ అరణ్యంలో ఆమొద్దుకు అంత్య క్రియలుచేశారు. ఆకలికి అలమటించి పోతున్న వారికి తల్లి మహాలక్ష్మి ఆ అడవిలో అత్తిచెట్టు – అరటిచెట్లు సృష్టించింది. వాటి ఫలాలు తిని బాలలు స్వస్థత చెందేరు.
ఒకానొకనాడు బాలలు తిరుగాడుతున్న అడవికి వంగదేశపు రాజు వేటకొచ్చేడు. వేటాడి అలసిపోయిన రాజుకు దాహం వేసింది. దగ్గరలో తపస్సు చేసుకుంటున్న మునిని ఆశ్రయించాడు. ఆయన కన్నులు తెరువ లేదు. రాజు కోపించి ఒక మేకను చంపి దాని రక్తాన్ని మునిపై వేశాడు. ముని కోపగించి రాజ్యభ్రష్టుడివై రాత్రులందు పులివై తిరుగాడుమని శపించాడు. ఆ మహారాజు ఈ ఏడుగురు ఆడబిడ్డలను చేరదీశాడు. రాత్రు లందు తన వల్లగాని మరే ఇతర జంతువుల వల్లగాని వాళ్ళకు ప్రమాదం సంభవించకుండా ఒక మంచెను కట్టించి వారినందులో ఉంచి వండివార్చి పెట్టి వారిని ఆదరిస్తున్నాడు.
కొద్దిరోజుల తర్వాత బాలలు మేనమామలు పానుగంటి నుండి ఆ అడవికి వేటకువచ్చేరు. వారీ బాలలను చూసేరు. వంగదేశపు రాజుతో చెప్పి వాళ్ళను తమ పానుగంటికి తీసుకువెళ్లారు. వాళ్ళు తమ తోబుట్టువు భూలక్ష్మీదేవి పిల్లలని తెలుసుకున్నారు. వాళ్ళను తమ ఏడుగురు కుమారు లకు ఇచ్చి వివాహము చేశారు.
తండ్రి నవాంభోజరాజు పిల్లలను అడవిలో వదిలిపెట్టిన తర్వాత తాను ఢిల్లీ జమాబంధీకి వెళ్ళేడు. ఇంతకాలంగా తమ దర్శనానికి రాలేదని సుల్తాను కోపంగా చూసేడు. వాళ్ళు కప్పం బాకీ ఉన్నందు వల్ల కోటను స్వాధీనం చేసుకొని మాణిక్యాలదేవిని నవాభోజరాజును వెడలగొట్టేరు. వారు బిక్షమెత్తకుంటూ వారూ వచ్చే భిక్షతోజీవిస్తున్నారు. అడవిలో పుల్లలు కొట్టుకొని అమ్ముకుని క్రమక్రమముగా పానుగంటిపట్నం చేరుకున్నారు.పానుగంటి కోటపై మండువాలో గచ్చకాయలు ఆడుకుంటున్న ఏడుగురు అప్పచెల్లెళ్ళు తండ్రిగొంతును గుర్తుపట్టి చేరదీశారు. మాణిక్యాల దేవి భర్తజాడతెలియక అడవిలో అల్లాడుతూ ఉత్తర దిశగా వెళ్ళిపోయింది.
BALANAGAMMA తన భర్త కార్యవర్ధినుని ఢిల్లీ పాదుషా వద్దకు వెళ్లమని కోరింది. తండ్రి బాగుకొరకు జామీనుండి తన తండ్రి రాజ్యాన్ని తండ్రికి వచ్చేలా నవాబును అర్థించమన్నది. సరే అని కార్యవర్థి ఢిల్లీ వెళ్ళి పాదుషా దర్శనం చేసుకున్నాడు. తన మామరాజ్యాన్ని తమ మామకిమ్మని నవాబును ఒప్పించి ఫర్మానాతీసుకున్నాడు. మామగారిని యధా ప్రకారంగా రాజ్యాధికారినిచేశాడు. ఆయనరాజ్యాన్ని పరిపాలించి కొంత కాలానికి కన్ను మూసేడు.కార్యవర్థి తాను తన అన్నలుకలిసి తమకు మేనమామ, తమ భార్యల తండ్రియగు నవాంభోజరాజు కర్మలలోపాల్గొనేందుకు ఘండి కోటకు బయలుదేరారు. తలారిరాముడ్నిపిలిచి బోధచెప్పేరు. కోటగుమ్మం దాటి జంగాలు వచ్చినా, జోగీలు వచ్చినా, పరదేశ వాసులెవరు వచ్చినా కోటగుమ్మం దాటనివ్వవద్దని హెచ్చరించారు.
రెండవ భాగం
గండి కోటలో జరుగు నవాంభోజరాజు కర్మకాండలకు కార్యవర్థి రాజు అతని ఆరుగురు అన్నలు, ముగ్గురు మంత్రులు, వెంట భటులతో బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ కోటలో భూలక్ష్మీదేవి కుమార్తెలు సూర్య నాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తరకన్య, దక్షిణకన్య, పగడాల నాగమ్మ, ఉత్తర కన్య, BALANAGAMMA ఎంతో అన్యోన్యముగా ఉన్నారు. ఏడవ బాల BALANAGAMMA గర్భవతైనందున ఆమెను అందరూ ఎంతో శ్రద్ధగా చూస్తున్నారు.

నాగళ్ళపూడి గట్టున ఫకీరు ఉంటున్నాడు. వానికోటలో వెండి మేడలు, బంగారు మేడలు, ఆమేడలు నడుమ పన్నెండు స్థంబాల మసీదు అలరారు తున్నాయి. మంత్రతంత్రా లయందు క్షుద్రదేవతోపాసనయందు సాటిలేని వాడై మాయలఫకీరుగా కీర్తి కలిగి అలలారుతూ ఉండేవాడు. భూతప్రేత పిశాచాలు ఫకీరు మాటకు కట్టుబడిఉండేవి.ఒకనాడు ఫకీరు తన మిద్దెపై కూర్చుని పెరటిలోని చెట్లను చూస్తు న్నాడు. రెండు చెట్లుమీద వాలిన పక్షి జంటలను చూశాడు. వాటి కిచకిచ లకు ముచ్చట చెందేడు. తన పెద్ద మిండెగత్తె సంగును పిలిచేడు. చూడవే వాటికులుకు. నువ్వు ఉన్నావు అందమా! ఆనందమా! అన్నాడు. ఓయి! ఫకీరు నన్నుమించిన సొగసుగత్తె నాగళ్ళపూడి గట్టుకోటలో ఎక్కడ ఉన్నది? అన్నది సంగు. ఔ ఔ! నిన్ను పోలిన అందగత్తె మాటేమోగాని, నీవంటి ముసలిదిలేదు. నిన్నుమించిన అందగత్తెనుతెస్తాను.
అదీ నువ్వుజగడమాడితే ఆనందిస్తాను. కాసుకోకామినీ అన్నాడు ఫకీరు. చాలులే ఫకీరు గంజాయి మత్తులో వదరుతున్నావు. నేను గనుక నిన్ను దరిజేరనిస్తున్నాను. నీ బవిరి గెడ్డాన్ని, నిన్ను మరే నాతి చేరనిస్తుంది? మాటలు మాని బుద్ధిగా నన్నేలుకో. సరదాలకు పరదాలు దీసి పరవ సింపచేస్తాను అన్నది. వట్టి గొప్పలకు పోకే, నన్నుత్తి వదరుబోతుగా తలచకే. నిన్ను మించిన అందగత్తె లేదా- చూడవే చూపుతాను అని అంజనం వేశాడు. క్షుద్ర దేవతలను తలచుకు న్నాడు. చూపండ్రా చూపండి, నా సంగుకు మించిన అందగత్తెను అని ఫకీరు అంజనాన్ని ఆలోకించాడు. అదుగో అదుగో చూడవే నిన్ను మించిన నాతి, పానుగంటి రాణివాసపు బామ BALANAGAMMA.
తెస్తానే నీకు మారుగా తెస్తానేఅన్నాడు. ఓయీ! ఫకీరు వెర్రి కలలు కనకు, పానుగంటి రాజకుమా రులు సామాన్యులు కారు. అనిబెదిరించింది. నా మంత్ర తంత్రాలతో వాళ్ళ వీరత్వం ఉఫ్ అన్నాడు. ఆ BALANAGAMMA పతివ్రత – ఆవిడజోలికి వెడితే భస్మ మైపోతావు అన్నది సంగు. పోవే! దబాయించకు నాక్షుద్రశక్తికి ఆ బాలకుక్కలా తోకఆడిస్తూ వస్తూందే అన్నాడు. ఫకీరు సరి సరివెళ్ళు నీకర్మఅన్నది సంగు.
పానుగంటి పురానికి యేవేషంతో వెళ్ళాలా అని అనేక వేషాల వేశాడు. కడక జంగందేవర వేషం అతనికి సానుకూలంగా కనబడింది. జంగందేవరగా పానుగంటి పురం కోటకు చేరుకున్నాడు.
తలారి రాముడికి సంతానం
తలారి రాముడు కోటకు కాపలా ఉన్నాడు. అతడ్ని సమీపించాడు. పకీరు జంగం దేవరణ భంభం అని శంకం ఊదాడు. గణగణమని గంట వాయించాడు. దండాలయ్యా జంగందేవరా! కోటలోపలికి పోవ ఆజ్ఞలేదు. తిరిగిపోవయ్య అన్నాడు. తలారి ఓరి ! తలారి శివపూజకు భిక్షకావాలిరా, రెండిళ్ళు తిరిగి వచ్చేస్తానురా రాముడు వెళ్ళనియ్యరా అన్నాడు ఫకీరు. నీకు అనుమతి వ్వను రాజులు వింటే నా తలతీస్తారు. దయచేసి వెళ్ళిపో అన్నాడు తలారి. తలాతోకాలేనట్టి యేమిటిరా నీకీ మొండితనం పిల్లా జెల్లాలేని నీకిదేం బ్రతుకు ఆశ అన్నాడు. తలారికి ఆశ్చర్యం కలిగింది.
తనకు పిల్లలు లేని సంగతి తెలిసి చెబుతున్నాడీ జంగమదేవర అయ్యా నాకు బిడ్డలు లేరని నీకెట్లా తెలుసు చెప్పమన్నాడు. ఔనురా మాకంటికి కానలేని దేముందిరా, ఏడుగురు సతులున్నా యేఒక్కతీ నీకు బిడ్డనివ్వలేదు. నన్ను నమ్ముకోరా! నీకు బిడ్డల కొదవే ఉండదు. అన్నాడుఫకీరు. అనుగ్రహించు దేవరా! అన్న రాముడి మాటలు విని తనజోలిలోని విభూతి నిచ్చి నీ భార్యలకు బొట్టు పెట్టి నీవు పెట్టుకో. నోట చిటికెడుపోసుకోండి. వెళ్ళరా వెళ్ళు అని వాని మేడకు పంపించాడు.ఇంటికి వెళ్ళిన తలారి జంగం దేవర చెప్పినట్లు చేసాడు. విభూధిని గోడలమీదజల్లాడు. ఇక్కడా అక్కడా అనకుండా అంతటా చల్లేడు. అంతే మరక్షణంలో బిడ్డలు కొల్లలుగా పుట్టుకొచ్చారు. తిండి పెట్టు తినడానికే మన్నాపెట్టు అని తలారిని పీక్కు తిన్నారు. హడలిపోయి జంగమ దేవరను చేరి కాళ్ళపై పడ్డాడు. కనికరించేను లేవరా నాతి కొకడుగా నీకు
ఏడుగురు బిడ్డలు కలుగుదురు. అని విభూది వారిపై జల్లాడు. పిల్లలంతా మాయమై ఏడుగురు మాత్రంమిగిలేరు. అబ్బురపడి తలారి రెండిళ్ళుతిరిగి వచ్చి వేయ వలసిందిగా జంగమమూర్తిని కోటలో ప్రవేశించడానికిఅనుమతించేడు.జంగమ దేవరా నేనైతే నీకీ దర్వాజా దాటడానికి అనుమతించాను, ఇంకా ఆరుద్వారాలున్నాయి. రెండవ దర్వాజాకు పులులు కాపు, మూడవ దర్వాజాకు ఏనుగుల కాపు, నాల్గవ దర్వాజాకు చిఱుతలు కాపు, అయిదవ ధర్వాజాకు సింహాలు కాపు, ఆరవదర్వాజాకు బొందిలీలు కాపు, అన్నాడు. ఓయీ! తలారీ పోగలిగిన ముందుకు వెడతాను. కాదని తిరిగి వచ్చేస్తాను అని బయలుదేరాడు.
BALANAGAMMA అపహరణ
మొదటి బురుజు దాటి, జంగమదేవర తన అడుగులకు మడుగు లెత్తే క్షుద్రశక్తులను పిలిచేడు. ఆరుబురుజుల వద్ద ఉన్న అడ్డంకుల్ని తొల గించ మన్నాడు. అవి ఆయా దర్వాజాల వద్ద కాపలావున్న వాటికి గడ్డి, ఆవులు, మేకలు, మాంసము ప్రయోగించి వాటిని దృష్టి మళ్ళించాయి. ఫకీరు నేరుగా BALANAGAMMA మేడ కాక అప్పచెల్లెండ్రలందరి కోటలకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.
పెద్దామె సూర్యనాగమ్మ మేడ కొచ్చేడు. ఆమె చారెడు ముత్యాలు బిక్షవేసింది. తక్కిన అయిదుగురి ఇళ్ళకు వెళ్ళి భిక్షను అందుకున్నాడు. BALANAGAMMA మేడకు చేరుకున్నాడు.BALANAGAMMA దాసీచేత బిక్ష పంపిం చింది. జంగమదేవర తిరస్కరించాడు. ఇంటి యజమానిని వచ్చి బిక్ష వెయ్యమన్నాడు.

ఆరురోజుల బాలింత BALANAGAMMA ఎట్లు వచ్చి నీకు బిక్ష వేస్తుందన్నారు దాసీలు. పసికూనను ఎగరేసుకుపోతాను ఇది మహేశ్వరి ఆన అన్నాడు. అది విని BALANAGAMMA గడగడ లాడింది. పురిటిస్నానం చేసింది. BALANAGAMMA ఏడువారాల నగలు ధరించింది.BALANAGAMMA శేరు ముత్యాలు చేతబట్టింది. బిడ్డడు ఏడవడంతోBALANAGAMMA ఊరుకో బాలవర్థి అని జోలపాడి కోటగుమ్మానికి వచ్చింది. దేవర బిక్ష పట్టమన్నది. గిరి దాటి ఈవలకు రమ్మన్నాడు. BALANAGAMMA రాలేను నాధుని ఆజ్ఞ లేదన్నది. ఇది మహేశ్వరుని ఆజ్ఞ రా ఈవలికి వచ్చి బిక్షపెట్టు కాదందువేని నీకిచ్చిన బిడ్డను తీసుకొని పోతానని అది లించాడు ఫకీరు వచ్చింది. తన చేతి వెండి బెత్తమును ఆమె తలపై పెట్టేడు. బగ్గున బూడిదయ్యింది. బూడిదను ప్రోగుచేసి వసిడి బెత్తమును మోపేడు బూడిద కుక్కయై నిలిచింది.
ఆ కుక్కను వెంట తీసుకొని ఫకీరు తనకోటలోని మసీదునందుంచి మనిషిని చేశాడు. ఓరి ఫకీరా! వ్రతదీక్షలో ఉన్న దానిని తెచ్చావు నన్ను ముట్టేవో జంగమదేవర ఆన. వ్రతం ముగిసేవరకు పరాయిగడపదాటను. మొరాయించావో భూదేవిని తలచి శాపం పెడతాను. తలపగిలి చస్తావు. అన్నది BALANAGAMMA. ఫకీరు BALANAGAMMA మాటలకు దడదడలాడేడు. పన్నెండేళ్ళు వ్రతమా? నేను ఓర్చుకోగలనా అని వాపోయాడు. ఓర్చుకోగలిగితేనే నేను నీదాననయ్యేది అన్నదిBALANAGAMMA. కిమ్మనకుండా ఊరుకున్నాడు.పానుగంటిలో BALANAGAMMA జాడలేక అందరూ ఎంతగానో అలమ టించేరు. గండికోటకేగిన అన్నదమ్ములు తిరిగి వచ్చి విషయం తెలుసు కొనికోపగ్రస్తులయ్యేరు.
మాయలఫకీరు వచ్చి BALANAGAMMA ను చెరబెట్టుకు పోయేడని వాకబుచేసి చేసి తెలుసుకున్నారు. వన్నె డేగలతో గండికోటకు జాబులు పంపేరు. ఫకీరు వారికి జవాబులు పంపలేదు.రాజులు ఉగ్రులయేరు. తమ పన్నెండువేల కాల్బలంతో రెండు వందల ఫిరంగులతో, వేయి మంది అశ్వికులతో కత్తులు కటార్లు తీసుకొని ఫకీరు మీదకు దండువెడలేరు. మత్తుగా పడుకొని ఉన్నఫకీరు చూచి ఫిరంగులు బారు పెట్టారు. అయినా కదలని మెదలని ఫకీరును సంగు హెచ్చరించింది. వలదంటే BALANAGAMMA ను తెచ్చావు. ఆమె భర్త, బావలు దండు వచ్చేరని అరచి మొత్తుకుని వానిని లేపింది. అతడు లేచి BALANAGAMMA ను మసీదు పైకి తెచ్చి మీవారి బలగం వచ్చింది చూడవే అన్నాడు. చడీ కర్రకు జీవంపోసి సైన్యము మీదకు విడిచి పెట్టేడు. అది కాల్బలాన్ని మట్టు పెట్టింది. గుప్పెడు విభూది తీసుకొని దండు పై చల్లాడు. దండు మాడి మసై పోయింది. ఏనుగులు, గుర్రాలు, ఫిరంగులు రాశైపోయాయి. దండముతో అన్నదమ్ము లను శిలలు చేశాడు.
పానుగంటికీ వార్త చేరింది. గుండెదిటవు పరుచుకొని రాణులు రాజ్యమేలు తున్నారు. బాలవర్థిరాజును రాజ్యవారసుడ్ని శ్రద్ధగా పెంచు తున్నారు. విలువిద్య, సాముగరిడీలు ఖడ్గయుద్ధం బాలుడునేర్చు కున్నాడు. తాత తండ్రులు అడిన బొంగరా లడిగి తన కొక బొంగరాన్ని సమకూర్చు కొని ఆటలాడుతుండేవాడు. ఒకనాడు కుండలో నీళ్ళు మోసుకుంటూ వెడుతున్న స్త్రీని చూచి ఆమె నెత్తిమీద కుండను గురిచూచి బొంగరంతో కొట్టేడు. అది పగిలిపోయింది. ఆ వనిత అరమోడునేత్రాలతో బాలుని గదమాయించి అమ్మని తండ్రిని చెరసాల పాలవ్వనిచ్చి నువ్వు బ్రతుకు తున్నావు. నీకెందుకు చావురాదో పాపిష్టివాడా అని అనేక దుర్భాష లాడింది కడవ నెత్తుకొన్న కోమలాంగి. విన్నాడామె మాటలు, ఆమె కాళ్ళపై వాలేడు.
అమ్మరో చెప్పవే నా తల్లి యెవరో – తండ్రి యెవరో ఎందువల్ల వారు చెరసాల పాలయ్యారో చెప్పవమ్మ అని ఆమెను బ్రతిమ లాడేడు. ఏమనిచెప్పుదును నీకు. నీ తల్లి BALANAGAMMA. నీ తండ్రి కార్యవర్ధి రాజు. నిన్నుగన్న ఏడురోజులకు నాగళ్ళు పూడి గట్టుయేలే మాయల ఫకీరు మీ తల్లి BALANAGAMMA ను చెరబట్టి వెంటతీసు కొని పోయాడు. ఆమెను విడిపించడానికి నీతండ్రి – పెదతండ్రులు వెళ్ళి వానితో పోరాడి చనిపోయారు. నీ పెద్దతల్లులు నిన్ను పెంచుతున్నారు. అనిచెప్పింది. నన్ను దీవించు నా తల్లి BALANAGAMMA. ని తండ్రిని తెచ్చుకోగలిగేటట్లు ఆశీర్వ దించు అన్నాడు. బాలవర్ధిరాజు.
నీవు నీ తల్లి BALANAGAMMAని తెచ్చుకోగలవు. వాడికి ఆ మాయల మారి ఫకీరుకు నీచేత చావు తప్పదు అని అశీర్వదించింది. బాలుడు రివ్వున మేడకు చేరుకున్నాడు. తల్లులను పిలిచేడు. నాతల్లి యెవరని నిలదీశాడు. మేమేను అన్నారు. అయితే మీలో నన్నుకన్న ఆమె యెవరు చెప్పండి ఓ నా పెద్ద తల్లులారా! నన్ను మభ్యపెట్టకండి అని వాళ్ళను పదే పదే ప్రశ్నించేడు. నేనంటే నేను నిన్ను కన్న తల్లిని అని పెద్ద తల్లులు వానిని నమ్మించ బోయేరు. నా కెందుకిలా మర్మం చేస్తున్నారు. మన్నించి చెప్పండి నాతల్లి BALANAGAMMA యెవరు? నా తండ్రి పెదతండ్రులు యేమైనారు? నాయనా నీ కెవరేమి చెప్పేరయ్యా! ఈ రోజున నీ వింతగా అడుగుతున్నావు? చెబు తాము వినవయ్యాఅని బాలునకు వాళ్ళు అన్నివిషయాలని వివరించసాగారు.
నాయనా! బాలవర్థ నీతల్లి BALANAGAMMA. తండ్రి కార్యవర్థరాజు. నాగళ్లపూడి ఫకీరు నీతల్లి BALANAGAMMA ను అపహరించుకుపోయాడు. నీతండ్రులు ఆమెను విడిపించుటకు పన్నెండు వేల కాల్బలంతో, రెండు వందల ఫిరంగులతో, గజబలంతో యుద్ధానికి వెళ్ళేరు. ఆ మాయావి వాళ్ళను మోసగించేడు. అందరూ అక్కడహతమైపోయారు. నువ్వు ఆవేశపడకు. మమ్మల్ని దిక్కుమాలిన వాళ్ళను చెయ్యకు అన్నారు తల్లులు. అమ్మలూ! నా కొచ్చిన భయం లేదు. నేనా ఫకీరు జోలికిపోను. నా తల్లిBALANAGAMMA ని చూచి వస్తాను. అనుమంతించండి, ఆశీర్వదించండి అని వేడు కున్నాడు. వెళ్ళేలాగుంటే మమ్మల్ని చంపి వెళ్ళరా అన్నారు.
తల్లులారా కలవరపడకండి. నేను వాడిజోలికి పోను. యుక్తిగా నా తల్లి BALANAGAMMA ని చూచివస్తాను. ఇదుగో మీ ముందుగా మొక్కను నాటుతాను. నాకు మూడుపూటలా అన్నం పెడుతున్నట్లు మూడుపూటలా నీళ్ళు పోస్తూండండి. అది బాగుంటే నేను బాగున్నట్టు అది వడిలిపోతే నేను బాగులే టనట్టు గుర్తించండి అని పలికేడు బాలవర్థి.బాలుని పట్టుదలను కాదనలేక పోయేరు. తాతగారి చంద్రా యుధము తీసి ఇచ్చారు. తండ్రి తలపాగా కట్టేరు. బాలవర్థి తల్లుల పాదాలకు మ్రొక్కేడు. విజయోస్తూ అని వాళ్ళు ఆశీర్వదించి పంపించారు.
బాలవర్ధి తల్లిని చెరవిడిపించుటకు వెళ్ళుట
తల్లుల అనుజ్ఞ తీసుకున్నాడు. కైజారు మొలను పెట్టుకున్నాడు. కత్తిని చేత బట్టేడు. కంబళిని భుజాన వేసుకున్నాడు. గ్రామదేవతకు మ్రొక్కుకున్నాడు. అడవి వెంబడి ముందుకు బయలుదేరేడు. నడచి నడచి బాలవర్థి అలసిపోయేడు. చెట్టునీడను పరున్నాడు.పరున్న బాలుణ్ణి చూచేడు నాగేంద్రుడు. బాలుడ్ని కాటేయ దగ్గరకు వచ్చాడు. నాగమునీంద్రుని ఆశీస్సున పుట్టిన వాడని గుర్తించేడు. పడగ విప్పి నీడ పట్టేడు. బాలుడు మేల్కొని పాముని చూసాడు. కత్తి దూసుకొని పాము వెంట పడ్డాడు. నాయనా బాలవర్థి నీ తల్లి BALANAGAMMA నాగేంద్రుని వరాన పుట్టింది. కనుక నిన్ను అనుగ్రహించి వెళ్ళిపోతున్నాను.

నీ తల్లి BALANAGAMMA.ని నీవుతీసుకువస్తావు. ఫకీరు నీచేతచస్తాడు. నీకు గండ మున్నది వినవయ్య. నాగలపూడి గట్టున గల నయవారి పట్నమందు ఫకీరొక శక్తిని కాపుం చాడు. అది బాలెంత వేషంతో నిన్ను మ్రింగుటకు నీముందుకొస్తుంది. జాగ్రత్తగా వెళ్ళి దానిని తుదముట్టించు అన్నట్టి ఆ పాముకు సాష్టాంగ దణ్ణం పెట్టి బాలవర్థి ప్రొద్దువాలే వరకు నడచి పులిరాజు పట్నం చేరు కున్నాడు. పూటకూళ్ళ పెద్దమ్మ ఇంట మకాం చేశాడు.
బాలవర్థి పులినిచంపి రాజు కూతుర్ని పెళ్ళాడుట
నగరవిశేషాలేమిటని బాలవర్ధి పూటకూళ్ళ అవ్వను ప్రశ్నించాడు. నగరంలో పులి ప్రవేశించింది. అది రోజు రోజు మనుషుల్ని చంపుకు తింటున్నది. అష్టాదశ వర్ణాలవారు ఎవరైనా ఆ పులిని చంపితే తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తానని ఫర్మానా జారీ చేసాడు. బాలవర్థి కోటకు ఉత్తర ద్వారం చేరుకున్నాడు. అక్కడి కావలివారు తూర్పు దర్వాజాకు పొమ్మన్నారు. కాదు ఇటే వెళ్ళాలి . తాళాలు తియ్యమన్నాడు. అయ్యా ఈ దర్వాజాకు ఆవల పులి ఉన్నది. అంకిన వారిని చంపుకు తింటున్నది. అందువల్ల యెవ్వరూ పోవడానికి వీలులేకుండా దర్వాజా మూయబడింది అన్నారు. నేనిదే దారిని వెళ్ళాలని తలుపులు తీయించి లోపలకు ప్రవేశిం చాడు.
తిరిగితిరిగి దాని మకాంకనుగొన్నాడు. దాని రాక కొఱకు పొంచి ఉన్నాడు. వచ్చిన పులిని ఎదుర్కొన్నాడు. గుడ్డచుట్టుకున్న చేతిని దాని నోటపెట్టి రెండవ చేతిలోని కైజారుతో దాని గుండెల్లో పొడిచాడు. పులిన చంపిన పాప నివృత్తికి దాని గోళ్ళు, తోక తీసి సంచిలో వేసుకున్నాడు. అవ్వ ఇంటికి చేరుకున్నాడు.
తన తండ్రి చేసిన ధర్మాన్నను సరించి పులిని చంపి ఎటువంటి వాడు తనకు భర్తగావస్తాడో అన్నదిగులుతో ఆనాడు కోటపై తిరుగాడుతూ పులిరాజు కూతురు సుభద్ర బాలవర్థి పులిని చంపడం చూచింది. ఆ గ్రామంలోని వాడగు చాకలి తిప్పడు పులిని చంపి రాజుగారి అల్లుడు కావలెనని ఉవ్విళ్ళూరుతుండేవాడు.

మొండిగొడ్డలి భుజాన వేసుకొనిపులి తచ్చాడు ప్రాంతాలకు వచ్చాడు. చచ్చి పడివున్న ఆ పులిని చూచాడు. నిద్రపోతున్నదని తలచేడు. చెట్టుపైకి ఎక్కాడు. బల్లేన్ని దాని మీదకు విసిరాడు. కదలని మెదలని బెబ్బులి చచ్చినదని నిర్ణయించుకున్నాడు. క్రిందకు దిగాడు. ఒల్లురక్కుకున్నాడు. భల్లేనికి రక్తం పూసాడు. రాజసభకు వెళ్ళేడు. మొండితోక మొండిగోళ్ళు తీసుకొచ్చిన వాటిని ఋజువు అంటూ చూపించాడు. నేనొక తిప్పరాజును, మహారాజు కూతురునిచ్చి పెళ్ళి చెయ్య మన్నాడు. మాట తప్పుట మన్నించరాని దోషమని వివాహానికి ముహూర్తం పెట్టించేడు.
నాటికి మరునాడు ముహూర్తము కుదురుటవలన సన్నాహాలు చురుకుగా చేయసాగారు. రాకుమార్తెను పెళ్ళి పీటల మీదకు పిలుచుకు రావడానికి మహారాజు దాసదాసీలతో ఆమె వద్దకు వెళ్ళాడు. వచ్చిన తండ్రిని ఉద్దేశించి కూతురు సుభద్ర, తండ్రీ! పులిని చంపిన వాడు తిప్పడు కాడు. పులిని చంపిన వీరుడు పూటకూళ్ళ అవ్వ ఇంటి వద్ద ఉన్నాడు. పిలిపించండి అని పలికింది.
మహారాజు బాలవర్థిరాజును వెంటబెట్టుకొని రావలసినదిగా మంత్రి పురోహితులను పంపించాడు. విషయాన్ని చెప్పి పులిని చంపిన తమకు కూతుర్నిచ్చి వివాహము చేయ నున్నారు. రారమ్మన్నారు. రాకుమార్తె మీరు పులిని చంపడం మేడమీద నుండి చూచి ఉన్నది కనుక మీరు తప్పక విచ్చేసి మా రాకుమార్తెను వివాహమాడవలసినదన్నారు. పులిని తానేచంపానన్నాడు. పులిని చంపిన పుడు కోసి తీసిన తోకను, గోళ్ళను వెంటబెట్టుకొని వారితో రాజువద్దకు చేరుకున్నాడు. మహారాజా నేనిప్పుడు వివాహమాడుట తగదు.
నాతల్లి BALANAGAMMA నాగళ్ళపూడి గట్టు ఫకీరు చెరలో ఉన్నది. ఆమెను విడిపించి వచ్చి వివాహ మాడుతానన్నాడు.సరే అని మహారాజు అంగీకరించి తన వద్ద గల ఇరవై వందల సిబ్బందిని వెంట తీసుకువెళ్ళమన్నాడు. నేనొక్కడినే పోతానన్నాడు. నావద్ద నాగంబొట్లను విప్రుడున్నాడు. నీకు సహకరించగలవాడు. వెంట తీసుకు వెళ్లమన్నాడు. బాలుడు అంగీకరించి నాగంబొట్లను వెంట నిడు కొని నాగంపూడి గట్టుకు బయలుదేరాడు. దారిలో బాలవర్థికి దాహం అయ్యింది. వెతకగా వారికొక దిగుడుబావికనబడ్డది. అందులో దిగిదాహం తీర్చుకొని పైకివస్తున్న బాలవర్థిపట్టుతప్పి నూతిలోజారి పోయాడు.
బ్రాహ్మ ణుడు ఒడ్డునగల దుస్తులు, కైజారు, ఆభరణాలు తీసుకొని పారిపోయాడు.వేటకు అడవికి వచ్చిన గంగపట్నం రాజులు ఆరుగురు నూతిలో బడ్డ బాలవర్థనుని చూచారు. తమ తలపాగాలు, ముడిపెట్టి బావిలో వేసి బాలవర్థ నుని పైకి తీసారు. వైన మడిగి అతడిని తమ పట్నానికి తీసుకొని వెళ్ళారు. పది రోజులు అక్కడ ఉన్నాడు. వారు తమ కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తామన్నారు. తనతల్లిBALANAGAMMA ని తెచ్చుకు వచ్చినప్పుడు చేసుకుంటానన్నాడు. మర్నాడు నూతన గుడికి వెళ్లగా అక్కడగల విప్రుడు నాగం బొట్టును మన్నించి వానిని వారికి అప్పగించిబయలుదేరాడు. చీకటి పడే పర్యంతం నడిచేడు. అతదుపరి ఒక ఆలయం కనబడితే అందులో చేరి తలదాచు కున్నాడు. దేవాలయం గోడవద్దకు చేరిన నాలుగు వన్యమృగాలు తమ ఆహారం గురించి ముచ్చడించుకుంటున్నాయి.
బావా రేపటి నీ ఆహారమేమి టన్నది నక్క- యేదేని జీవి వేటకు చిక్కాలికదా అన్నది. మామా గజరాజానీ మాట ఏమిటన్నాయి అడవిలో నాకు ఆకులలములకు లోటేమిటన్నది ఏనుగు. మరి నీ విషయమే మిటన్నది నక్క ఎలుగును. ఏమున్నది ఈ రాజుగారి కూతురు రాచకురుపు తోనున్నది మూడురోజులలో చని పోతుంది. ఆమెనాకు ఆహారం అన్నది. నక్క యేమేమి! ఆమె రాచకురుపు నకు మందేలేదా అని భల్లూకమునడిగింది. లేకేం ఉన్నది. ఈ దేవాలయం మీద తెల్లాకుల నల్లని పువ్వుల చెట్టున్నది. దానిచెంత ఏడాకులు చెట్టు మొదలున గల సంజీవి పుడక తీసు కొని కురుపును చల్లనినీళ్ళుతో కడిగి నల్లనిపువ్వుల రసము పుండుపై పిండి ఆ ఆకులను ఏడింటిని ఒకదానిపై ఒకటి వేసి కట్టి మూడు రోజులు అలాగే ఉంచి కట్టు విప్పితే కురుపు ఎక్కడనో తెలియనంతగా మానుతుంది అన్నది.
ఆ మాటలువిన్న బాలవర్థి ఆకులను తుంపుకున్నాడు. పువ్వులను కోసుకున్నాడు. సంజీవపుడకను గ్రహించాడు. వాటిని తీసుకొని చిలుక వారి పట్నానికి చేరుకున్నాడు. చిలుకవారి పట్టణ ప్రభువు సూర్యవర్థి రాజును కలసి రాచకురుపును మాన్పిస్తానన్నాడు. కాదు నీకు అసాధ్యమీ కురుపు అన్నారు కొందరు. ప్రయత్ననించనివ్వండన్నారు మరి కొందరు. బాలవర్థి చల్లని నీళ్ళతో పుండును కడగమన్నాడు. కురుపుపై నల్లని పువ్వుల రసాన్ని పిండేడు. కురుపుపై ఏడాకులువేసి కట్టుకట్టాడు. ఆ కుట్టుపై సంజీవి పుడకతో తట్టేడు. మూడవ నాడు కట్టు విప్పగా కురుపు మటుమాయమై పోయింది.
ఆనందపరవశుడైన సూర్యవర్థి బాలుడ్ని ఎంతగానో పొగిడేడు. అతడు మాయల ఫకీరుకోటకు తల్లి BALANAGAMMA ని విడిపించుకోవడం నిమిత్తం వెళుతున్నాడని తెలుసుకున్నాడు. కూతుర్నిచ్చి పెళ్ళి చేయబోయాడు. తిరిగి వచ్చినప్పుడు చేసుకుంటానన్నాడు. మంచి రోజు చూచి బాలుడ్ని సాగనం పేరు, చిలుకవారి పట్టణ ప్రభువు సూర్యవర్థిరాజు.
నాగళ్లపూడి గట్టుకు బాలవర్థి
సూర్యవర్థి రాజు నుండి శలవుతీసుకొని చిలుక వారి పట్టణం నుండి బయలు దేరేడు బాలవర్ధి. పొలిమేరన ఫకీరుచే నియమించబడిన శక్తి బాలింతరూపంలో బాలుని ముందుకొచ్చింది. ముసి ముసి నవ్వులతో బాలుని సమీపించింది. ఓసి రక్కసీ నీ కిదేటివేషము అని కత్తిదీసి దాని గుండెలలో గుచ్చబోయాడు. ఆగవోయి రాజా నన్నుచంపి నీకేమి ప్రయోజ నము – నన్ను కూడి మెప్పించితివేని నీ తల్లి BALANAGAMMA. దొరుకు మార్గాన్ని చెబుతాన న్నది. కసుగాయను నాతో నీకు సరసమా అన్న బాలునకు తన శక్తినిచ్చి ఆనందించింది. మార్గం చెప్పమన్నాడు.
ఓయీ ! బాలవర్ధి నాగళ్ళపూడి గట్టున తంబళ్ళ పెద్దమ్మ ఉన్నది. అది ఫకీరుకు రండలు కట్టి ఇస్తుంటుంది. దానికి నువ్వు తంబళ్ళ శరభయ్య BALANAGAMMA ల పుత్రుడని చెప్పి దాని ఇంట ఆశ్రయం పొందు. నీ పనినెరవేరు తుంది వెళ్ళమన్నది. శక్తి- తానెటో పోయింది. బాలవర్థి తంబళ్ళ పెద్దమ్మ ఇంట ప్రవేశించాడు. దండలు కట్టడంలో ఆమెకు సాయపడుతుండేవాడు. ఫకీరు ఆ దండలు చూచి ఎంతగానో మెచ్చుకునే వాడు. ఇంతకాలంగా నీలోని ఈ సామర్థ్యం ఏమయ్యిందని ఆమెను ప్రశ్నించేడు. ఇది నాపనితనంకాదు. నామనవడువచ్చేడు వాడుకడుతున్నాడు అన్నది. వానిని తెచ్చి చూపమన్నాడు. ఒకనాడు దండకట్టి అందులో ఉంగరం పెట్టి – ఆదండను ఫకీరుతెచ్చిన కొత్తరాణి BALANAGAMMA. కిచ్చి రమ్మన్నాడు.
తంబళ్ళ పెద్దమ్మ BALANAGAMMA వెదకి ఆమెకిచ్చింది. నా కెందుకీదండ అని మసీదు గోడకు విసిరి కొట్టింది. క్రిందపడిన ఉంగరాన్ని చూసింది. ఇది ఎలా వచ్చిందని ఆలోచించింది. తన కొడుకు వచ్చేడేమో అనుకున్నది.ఫకీరు వానిని తెమ్మని తంబళ్ళ పెద్దమ్మకు గతంలో చెప్పిన ప్రకారం వానిని వెంటబెట్టుకొని తీసుకొని ఫకీరు వద్దకు వెళ్ళింది. బాలుడ్ని చూచేడు ఫకీరు. అతనితో ముచ్చట్లాడేడు. ఫకీరు నాదొక కోరిక అన్నాడు. ఏనుగులు కావాలా, గుర్రాలు కావాల, సిరులు సంపదలు కావాలా? మేడలు కావాలా కోటలు కావాలా కోరుకో అన్నాడు. చిన్నవాడ్ని నాకెందు కివన్నీ నీ దయ ఉంటే చాలుగదా? అని ఫకీరును మురిపించాడు. మాటలతో మరి నీకేం కావాలిరా చెప్పరా తీర్చుతాను అన్నాడు.
ఫకీరు నీ గట్టున పన్నెండు స్థంబాల మసీదు ఉన్నదట గదా?వెండి యేనుగులు, వెండిగుర్రాలు, చిలకలు, పావురాలు చిత్రాలు, చిత్ర విచిత్రా లుగా -అందాలు చిందేలా చిత్రించేవట కదా? నీ శెలవైతే చూచి వస్తాను అన్నాడు బాలుడు. ఆ మాటలకు నిశ్చేష్టుడయ్యాడు ఫకీరు. బాలుని ముఖం లోని నిశ్చలతకు స్థిమ్మితపడ్డాడు. ఓరోరి నువ్విప్పుడు చూడడానికి వలను పడదురా. నాకే ప్రవేశముకుదరదు. పానుగంటి నుండి BALANAGAMMA యను అందాల భామను నారాణిని చేసుకోవాలని తెచ్చేను. ఆమె పన్నెండు సంవత్సరాలవ్రతమున్నదన్నది. ఇంకనూమూడుసంవత్సరాల గడువున్నది. BALANAGAMMA ను చూచినా తాకినా తలపగిలి చస్తా నన్నది. కనుక మన మచ్చటకు పోవ వీలుపడదన్నాడు ఫకీరు.
ఫకీరు శాపం నీకు కదా నాకు కాదుగదా నేడు నీవు నన్ను అను మతిస్తే రేపటి నీకు అద్భుతమైన దండలు కట్టి తెస్తాను అని మెప్పించి వానినొప్పించాడు. తలుపులు తెరుచుకునే మూసుకునే మంత్రం నేర్పాడు. వెళ్ళిరా ఆమె జోలికి పోవద్దుసుమా అన్నాడు. రెట్టించిన ఆనందంతో బాలవర్థి మసీదుకువెళ్లేడు. లోపలికి ప్రవేశించాడు. తలవంచుకు కూర్చున్న తన తల్లినిచూచేడు. ఆమెను చేరి తన వివరాలు తెలియచెప్పేడు. బిడ్డడ్ని చేరదీసుకొని అక్కున చేర్చుకున్నది. ముద్దాడింది. నిన్ను తీసుకుని వెళ్లడా నికి వచ్చేనన్నాడు.
ఫకీరు చాలా మాయగాడు వాని దాటికి నీ తండ్రి పెదతండ్రులే తట్టు కొనలేక శిలలై పడివున్నారు. వాని జోలికి పోవద్దు నాయనా అని బ్రతిమలాడింది. అమ్మా నీ ఆశీస్సులుంటే వాని మంత్రతం త్రాలు నన్నేమి చేయగలవు? నేనొక పన్నాగము చెబుతాను విను నాతండ్రి ఉన్నప్పటి వలె సింగారించుకో. రేపటి ఫకీరు పూలవనానికి వచ్చినప్పుడు వానికి ప్రసన్నంగా కనబడు. నేనింక నీదానను. నాకెవరు దిక్కు ఉప వాసాలు ఉపద్రవాలు అంటూ స్థిరం స్థిమితం లేకుండా ఉంటాను. నీకు ఏమన్నా జరిగితే నాకేం దిక్కు అనివాడు నమ్మేలాగున పలకవలసింది. వాడు మాటల సారమును నాకు తంబళ్ళ పెద్ద ఇంటికి తెలియ జెప్పు అని కార్యవర్థి ఈవల కొచ్చి ఫకీరును కలసి మసీదున వేయివిధాల పొగిడి తంబళ్ళ పెద్ద ఇంటికి వెళ్ళిపోయాడు.
ఫకీరు తన ప్రాణాల గుట్టును చెప్పుట
మర్నాడు ఫకీరు పూలతోటకు విహారానికి బయలుదేరేడు. ఆ సమయానికి BALANAGAMMA మసీదు శుభ్రం చేయించింది. తాను ముస్తా బయ్యింది. పిండివంటలు చేయించింది. ఫకీరురాకకై దర్వాజావద్ద నిరీక్షిస్తూ నిలుచున్నది. ఫకీరు బాలనాగును చూచేడు. దరిచేరేడు బాలనాగూ సంతోషంగా ఉన్నావు.విశేషమేమిటని ప్రశ్నించాడు.నేను పట్టిన పన్నెండు సంవత్సరాలవ్రతం పూర్తికావచ్చింది. ఇంక తొమ్మిది రోజులలే గడువు వున్నది నాకింకెవరున్నారు. నువ్వే దిక్కు ఇంకనేను నీదానను. నీకునీమంత్రతంత్రాలకు యేనాడు యేముప్పు కలుగునో నీవు మరణిస్తే నాగతి యేమైపోతుంది అన్న దిగులుమాత్రమే నన్ను వేదిస్తున్నది అన్నది. దుఃఖాన్ని భయాన్ని ఒలకబోస్తూ… అరే BALANAGAMMA నీ కెందుకే నాబ్రతుకును గూర్చిన బెంగ నా ప్రాణాలు నాలోలేవే. నన్నెవరు ఎంతగా చిత్రహింసలు పెట్టినా చంపినా నేను చిటికలో లేచివారి అంతం పడతాను.
ప్రియాతి ప్రియమైన ఫకీరువి. నేను నాగేశ్వరుని వర ప్రసాదిని ఆయన నన్ను కనికరించి నాప్రాణాలను నిక్షిప్తం చేశాడు. ఎవరివల్ల నాకు యే విధమైన ప్రమాదం జరక్కుండా ఉండడానికి నా ప్రాణాలను ఒక మర్రి కొమ్మలో నిక్షిప్తం చేశాడు. పానుగంటికి ఉత్తరాన గల నాలుగు శాఖల మర్రిలో పైపైని గల శాఖలలో ఉన్నాయి నాప్రాణాలు. దానిని విరగగొడితే నాతనువు రాలిపోతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్ననంటే నీ రాణిని కాబోతున్న మనలో మనకు రహస్యాలుండకూడదని నీ రక్షణలో ఆ కొమ్మకు ఏ విధమైన ఉపద్రవము జరుగకుండా ఉండాలని చెబుతున్నాను అన్నది.

ఓ అలివేణి నాకు నా ప్రాణభయంలేదు. ఎవరివల్ల నాకు చావు లేదు. రాదు. నీవేమి బెంగపెట్టుకోకు. నా ఆయువు కొచ్చిన భయంలేదు. పాల సముద్రం – పెరుగు సముద్రం – నేతి సముద్రం చెరుకు సముద్రం- మంచినీటి సముద్రం – ఉప్పుసముద్రం- సురసముద్రం ఈ ఏడు సముద్రాలకు ఆవల ఒక జీవగడ్డ – ఆ జీవగడ్డలో రాతికోట- ఆరాతి కోటకు మధ్య అయస్కాంతకోట – ఆ కోటలో అయిదు వందల వెలగ చెట్లు – వాటి మధ్య ముంతమామిడిచెట్టు ఆ మామిడిచెట్టు తొర్రలోగల ఏడుదొంతర్ల లోని అడుగు దొంతర్లో బంగారు పంజరం – ఆ పంజరంలో పంచెవన్నెల చిలుక- ఆ చిలుక కంఠాన నా ప్రాణాలు. అది చచ్చితేనే నేను చచ్చుట అని ధైర్యం చెప్పి తన కోటకు వెళ్ళిపోయాడు ఫకీరు.
తంబళ్ళ పెద్ది రాగా ఆలోచించిన బాలనాగు తనకు వివిధ రకాల పూలతో దండలుకావాలన్నది. ఆ పూవుల వైనం చెప్పగలవా అని అడిగి వాటి వైనం వ్రాసి ఇస్తానుండని – ఫకీరు ప్రాణ రహస్యాన్ని వివరిస్తూ వ్రాసి దానిని నీ మనవడికి ఇవ్వవలసినదని చెప్పి పంపించింది. ఈ ఉత్తరాన్ని బాలవర్థిచూసుకున్నాడు. విధివిధానం యేమిటా అని ఆలోచిం చాడు. తమ మకాముకు దగ్గరలోని చెట్టుమీద గల గండభేరుండ పక్షి పిల్లల్ని నాగేంద్రుడు తిని పోతూండడం గతంలో చూచిన అంశాన్నిగుర్తు చేసు కున్నాడు. ఆనాడు పక్షులు మేతకు పోయినందువల్ల నాగేంద్రుడుపిల్లల్ని తినడానికి చెట్టెక్కుతాడని నిర్ణయించుకున్నాడు. పామును చూచి పిల్లలు భయపడి అరవడం విన్నాడు. కత్తితీసుకొని బాలవర్థి చెట్టును చేరుకున్నాడు. కత్తిదూసి చెట్టెక్కుతున్న నాగును ఒక్క వేటు వేశాడు. దాని పన్నెండు శిరస్సుల లోని ఒక శిరస్సు బాలవర్దిని కాటువేసింది.
గండభేరుండ పక్షులు గూటికి వచ్చేయి. పిల్లలు జరిగిన సంగతి చెప్పి బాలవర్థిని బ్రతికించమని రోధించాయి. వారిని ఊరడించి తల్లీ తండ్రి సంజీవి పర్వతానికివెళ్ళి పుల్లనుముక్కునకరచితెచ్చి బాలవర్థిని బ్రతికించేయి. అక్కడ పానుగంటిలో బాలుడు నాటిన మొక్క వాడిపోయింది. పెద్ద తల్లులు తల్లడిల్లిపోయారు. శోకాలు పెట్టేరు కొంతసేపటికి మరల మొక్క నవనవలాడింది. తల్లుల ముఖాలు వికసించాయి.
ఇక్కడ గండభేరుండ పక్షులు బాలవర్థి పేరు ఊరు వివరాలడిగేయి. ఇక్కడకొచ్చిన పనేమిటని ప్రశ్నించి తెలుసుకుని బాలవర్థిరాజా విచారిం చకు నిన్ను క్షణకాలంలో సముద్రాలు దాటించుతామని వానిని రెక్కల క్రింద అదిమిపట్టి సప్తసముద్రాల కావలగల జీవగడ్డలో దిగవిడిచేయి.బాలవర్థి తల్లిమీద ఆనచేసి చంద్రోదయముతో మర్రి నొక్క వేటు వేశాడు. చిటారు కొమ్మ యందుగల దొంతులు గాడిదలంత మొదలులో ఉన్నవి. నేలరాలేయి. గండభేరుండ పక్షులు వాటిని అంతమందించేయి. ఆఖరిదొంతునగల పంజరాన్నితీసుకొనివచ్చి గండభేరుండాల సాయంతో తన స్థానానికిచేరుకున్నాడు. ఫకీరు ఈసరికే కదిలిఉంటాడు. తొందరపడ మని బాలుడ్ని పక్షులు హెచ్చరించాయి. అతని చెవిపోగులుదీసి పక్షి
కాళ్ళకు బంధాలుగాతగిలించాడు. ఫకీరు తనకాళ్ళకు బంధాలు తగిలి నట్లు సంకో చించాడు. పక్షిగాని మేతకు వెళ్ళి యే పొదల్లోని పాదులకో చిక్కుకున్నదను కున్నాడు.బాలవర్థి చేతికి చిక్కిన చిలక బంగారు ఈకలతో నవరత్నాల ఆభరణాలతో పంచవన్నెలతో రమ్యాతి రమ్యంగా ప్రకాశిస్తోంది. చిలుకకు మసిపూసి నల్లగా చేశాడు. దానిని చంకన బెట్టుకుని సంగు ఇంటికిచేరు కున్నాడు. ఆ సమయాన సంగు గానుగాడుతున్నది.
గాండ్లసంగూనీకు సాయపడతాను పిండిపెడతావా అన్నాడు. నువ్వాడినదంతా నీకే అన్నది. గానుగెక్కి చిలకను గానుగపై ఉంచాడు. ఫకీరు తోటలో తూలుతూ తూలుతూ నడిచి గాండ్ల సంగు ఇంటికి చేరుకున్నాడు. గానుగ మీదగల కుర్రవాడ్ని చిలకను చూచి ఇది నీకెక్కడిదిరా అన్నాడు. అప్పుడు బాలవర్ది కాదుకాదు ఇది నల్లగా ఉంది నీది కాదన్నాడు. ఫకీరూ! బాలనాగమ్మను తెచ్చేవు ఆమె యెవరని ప్రశ్నించేడు. పానుగంటిరాణి అన్నాడు. బాలుడు వెంటనే చిలుక పీకనొక్కేడు. వద్దురానొక్కొద్దు BALANAGAMMA నాకుతల్లి అన్నాడు.
ఓయీ ఫకీరు నీవద్ద మంత్రాల దుడ్డు ఉన్నదట అది నీవు చెప్పిన చోటికి పోయి యుద్ధాలు చేస్తుందట నాకు చెప్పేవేకావు దానిని నాకివ్వ వలసిందన్నాడు బాలవర్ది. ఇవ్వనన్నాడు ఫకీరు. చంపుతాను చిలక నన్నాడు బాలుడు. చంపవద్దని బ్రతిమాలేడు మరాటిదుడ్డుకరను ఇస్తా నన్నాడు. ఓయీ మరాటీ నీ వద్ద గోటిచిప్ప కోవెల మేడలు కట్టగలదట నీ దానిని నాకిచ్చెదవా అడిగేడు బాలుడు. ఇవ్వనన్నాడు అయితే చిలుకను చంపుతా నన్నాడు బాలుడు. వద్దు వద్దు ఇదిగో తీసుకో గోటిచిప్ప అనిఅప్పగించాడు మరాటి. ఓ ఫకీరూ! నీవద్ద వెండి బెత్తము బంగారు బెత్తము ఉన్నవట. ఒకదానితో కొడితే మనిషి ఔతుందట, రెండవదానితో కొడితే కుక్క అవుతుందట, వాటిని నాకియ్యమన్నాడు – ఇవ్వనన్నాడు – పక్షిపీక నొక్కుతా నన్నాడు.
చంపకు చంపకు ఇవిగో వెండి బెత్తము, బంగారు బెత్తము తీసుకోఅన్నాడు ఫకీరు. ఓయీ ఫకీరు నీ దేవిడీకి ఆవలగల మనుష్యుల విగ్రహాలను మనుష్యులుగా మార్చు అన్నాడు బాలుడు. ఓయీ! వాళ్ళు నావిరోధులు వాళ్ళను మనుష్యులుగా మార్చడం కుదరదన్నాడు ఫకీరు. అయితే చిలకపీక నొక్కక తప్పదన్నాడు సరి సరి వారు మనుష్యులైతే నాకేమినష్టం అని, ఫకీరు అక్కడగల కారంపూడి రాజుల మంత్రుల, సైనికుల విగ్రహాలను మనుష్యులుగా మార్చాడు. ఇదంతా తంబళ్ళ పూడి పెద్దవ్వ వలన సంభవించింది దానిని చంపుతా నంటూ బయలుదేరబోయాడు. బాలవర్థి చిలుక కాళ్ళు సాగదీసాడు. ఫకీరు ముందుకు అడుగు వెయ్యలేక పోయాడు.
తంబళ్ళ పెద్దని పిలుచు కువచ్చేడు. BALANAGAMMA ను తెచ్చిపల్లకిలో కూర్చుండబెట్టేరు. ఓ సంగు వెనుక కొమ్మునెత్తుకో. ఓయీ ఫకీరు ముందు కొమ్మునెత్తుకో అని వాళ్ళ చేత BALANAGAMMA ను కూర్చున్న పల్లకిని మోయించాడు. గట్టుచివర డేరాలు మోయింపచేసాడు. ఆరుగురు పెదతండ్రులు, కన్నతండ్రిని చూచేడు బాలుడు తల్లిని వారందరిని కూడదీసుకొని మంత్రులతో, భటులతో పానుగంటి దిశగా బయలుదేరాడు.పొలిమేరలో పొలిమేరశక్తి ఎదురుగా వచ్చింది. తల్లి BALANAGAMMA తండ్రిని తీసుకొని వచ్చేవు. సంతోషం అన్నది శక్తి. మరాటి వాని యొద్ద ఉండుమూడు వందల ముక్కోటి భూతాలను, ఏడు వందల ఎర్రభూతాలను చూపించమని బాలుడు పొలిమేర శక్తిని అడిగేడు.
ఓయీ బాలకా ఫకీరు వద్ద లోగడ నువ్వు చెప్పించుకున్న మంత్రాన్ని పఠించు నీకవి కనబడ తాయి. మంత్రాన్ని ముమ్మారుజపించేడు. భూతాలన్నీ బాలుని ముందు కొచ్చి నిలబడ్డాయి. ఇంక మీరు ఫకీరు పిలిస్తే పోవద్దు. మీకు స్వేచ్ఛ యిస్తున్నాను. ఇచ్ఛానుసారం వెళ్ళిపొండి అని వాటిని విడుదల చేశాడు.
బాలవర్థి పొలిమేర నుండి బయలుదేరి నయవాది పట్నం చేరు కున్నాడు. భోజనాలు చేసేరు. మరల ప్రయాణాన్ని కొనసాగించి చిలుకవారి పట్టణ మొచ్చేరు. పట్టణము వద్ద డేరాలు వేశారు. ఢంకాలు మ్రొగించేరు. ప్రభువు సూర్యవర్థిరాజు ఢంకాలును విన్నారు.
యెవరోరాజు లొచ్చారని భావించి తాబేదారులను చూచిరమ్మని పంపించాడు. పారా వారు డేరాలకు చేరుకున్నారు. తాము సూర్యవర్థి రాజు నౌకర్లమని వివరించేరు. తామెవ్వరో తెలుసుకురమ్మన్నారు మా ప్రభువులు అన్నారు. మేము పానుగంటి ప్రభువులము నాగళ్ళపూడి గట్టు నుండి మాస్వరాజ్యా నికి వెడుతున్నాము. మమ్మెందుకలా అడుగుతున్నారన్నారు. పానుగంటి ప్రభువులు బాలవర్థిని చూచి మీతల్లి BALANAGAMMA తండ్రిని తీసుకొని వచ్చిన బాల వర్థీ రావయ్యా కోటకు వెడదాము అని పలుకగా అందరూ కోటకు చేరుకున్నారు.

ఓ ! బాలవర్ధిరాజా! నాగళ్ళపూడి గట్టుకు వెళ్ళి వచ్చినందుకు మా కందరకు సంతోషం మీ తల్లి BALANAGAMMA తండ్రి మీ వారిని అందరిని తీసుకు వచ్చినావా? ఆ మరాటి కడు కఠోరుడు. వానిని యే విధంగా జయించేవు? ఏడు సముద్రాలు కావల చెట్టు తొర్రలో గల పంజరంలోని చిలుక వాడి ప్రాణం… గండభేరుండ పక్షుల సాయంతో వెళ్ళి చిలుకను పట్టి తెచ్చేను అని జరిగిన సమస్తాన్ని వివరించేడు.
సూర్యవర్థిరాజు పానుగంటి రాజులను యేడుగురును తగిన మర్యాదలు చేసి విందులు ఏర్పాటుచేసాడు. మూడురోజులు గడిచేక ఓ బాలవర్థిరాజా చేసిన బాసను మరిచేవా? నీ తల్లి BALANAGAMMA తండ్రి కూడా ఉన్నారు. ఇంతకు మించిన సమయం దొరకదు. నా కూతురిని వివా హము చేసికొని వెళ్ళు. నీ BALANAGAMMA తండ్రి చెర విడిపించుకు వెళ్ళునపుడు పెళ్లి చేసుకుంటా నని బాసచేసావు గదా? నీవు మీవారు పెండ్లికి అంగీక రించి నన్ను ధన్యుణ్ణి చేయవలసిందిఅన్నాడుసూర్యవర్ధిరాజు. అందుకుఅందరూ అంగీకరించారు.
విప్రులను పిలిచి వివాహముహూర్తము పెట్టించి బాలవర్థికి తన కూతురు నిచ్చి వివాహము జరిపించేడు చిలకవారి పట్టణ ప్రభువు. వధూవరులను నగరనాలుగు వీధుల్లో ఊరేగించారు. కైవార నీరాజనాలు చెలువొందచేసారు. తలంబ్రాలు పోయించేరు. కూతురుకు పసుపు కుంకుమలు నిమిత్తము దొంతిరాజు పట్నం చదివించేరు. ఆరవనాడు పెళ్ళివారు గంగవారిపట్నానికి చేరుకున్నారు.పట్నం వెలుపల డేరాలు వేశారు. గుఱ్ఱాల మీద డంకాలు వేయిం చాడు. ఆ ధ్వనులను విన్న గంగవారి ప్రభువులు వారెవరో తెలుసుకు రమ్మని నౌకర్లను పంపించేరు. మీరెవరో వైనమడగమని మా ప్రభువు లన్నారు. తాము పానుగంటి ప్రభువులమని నాగళ్లపూడి గట్టునుండి వస్తున్నా మన్నారు. మా పానుగంటికి వెడుతూ మీ ప్రభువులను చూడ గోరి మజిలీ వేశాం అన్నారు. యెవరయా బాలవర్థి? తల్లిదండ్రులను చెర నుండి విడిపించి వచ్చినాడా? రారండి తమరందరిని మాప్రభువు కోటకు తీసుకు రమ్మన్నారు. అని కోటకు తీసుకువెళ్ళారు పరివారం.
గంగావారి పట్నం ప్రభువువారిని సాదరంగా ఆహ్వానించెను. ఘనముగ మర్యాద లొనర్చెను. నాగళ్ళపూడి గట్టునుండి మీ వారినందరిని తీసుకొని వచ్చినందుకు సంతోషం. ఆమరాటి సామాన్యుడుకాదు. వాడు మీకెట్టు లొంగెను వివరించమని అడిగాడు సూర్యవర్థి రాజు. బాలుడక్కడి విషయాలు తాను చేపట్టిన పనులు సమస్తము వివరించాడు. బాలవర్ధి రాజు నాగళ్ళగట్టుకి వెళ్ళినపుడు తల్లిని చెర విడిపించుకు వచ్చినపుడు నా కూతుర్ని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చిన ప్రకారం నా కూతుర్ని వివాహ మాడవలసింది. మీ వారందరూ ఉన్నారు. ఇంతకు మించి మంచి సావకాశము మరేమిటుంటుంది అని యనెను సూర్యవర్థి.
బాలవర్థి తల్లితండ్రులకు విషయాన్ని వివరించి వారి అనుమతి పొంది సూర్యవర్థి కుమార్తెను పెండ్లాడుటకు అంగీకరించాడు. ఆకాశ మంత పందిరి, భూమియం వేదిక వేసి అత్యంత వైభవముగా వివాహం జరిపించాడు సూర్యవర్థిరాజు, చిలకవారి పట్టణాన్ని అల్లునికి కానుకగాను, దొంతి రాజ్యమును కూతురుకి పసుపు కుంకుమ గాను చదివిం చాడు మహారాజు. వియ్యాలవారిని ఘనంగా సత్కరించి పానుగంటి పురానికి బయలుదేరదీశారు. అక్కడనుండి బయలుదేరి పులిరాజు పట్నం ముందు డేరాలు వేశారు. నగారాలు మోయించారు. బాలుడు పులిరాజు కచ్చేరికి గుర్రముపై వచ్చెను. ఎన్నాళ్ళకెన్నాళ్ల కొస్తివని రాజు వానిని కౌగలించు కొన్నాడు. తాను తన తల్లితండ్రులను తెచ్చిన వైనమును వివరించాడు. పులిరాజును పానిగంటి ప్రభువును ఆహ్వానించెను. విందు, వేడుకలు జరిపించెను. తొల్లంటి వాగ్దానము ప్రకారము తన కూతుర్ని వివాహం చేసుకోమన్నాడు. తల్లితండ్రుల అనుమతితో బాలవర్థి అంగీక రించాడు. అత్యంత వైభవముగా వివాహము జరిగింది. మరినాలుగు రోజులుండి వారే శెలవు తీసుకొని పానుగంటి పురానికి బయలు దేరేరు.
పానుగంటిలో బాలవర్థి
పానుగంటి పురం పడమటి దిక్కున గల పూలతోటలో డేరాలు వేశారు. బాలవర్థి వచ్చినకబురు పెద్ద తల్లులకు తెలిసింది. వారంతాజత కూడి పూలవనానికి బయలుదేరారు. అంతలోబాలుడు ఎదురుగా వచ్చి నిలిచాడు. వస్తివా తండ్రిని చూసితివా, నీతల్లిని చూసితివా అని వానిని ప్రశ్నించారు. తల్లులారా తండ్రులను చూచితిని. నా తల్లితండ్రులను చూసితిని.’గాజులశెట్టిని పిలిపించి పెద్దతల్లులకు గాజులు తొడిగించాడు. ముత్తయిదువులను పిలిపించి వారి కొప్పులలో పూలు తురిమించాడు. నుదుట తిలకం అమరించాడు. యేమిటిదంతా అని వారు కలవరుపడుతుండగా తన పెద్దతండ్రులగు వర్ధి రాజులను రావించి ఆయ దంప తులకు తలంబ్రాలు పోయించాడు. ఆనందం అందలాలెక్కింది.ప్రమోదం విరబూసింది.https://photos.app.goo.gl/juQfc33Rxt58MW5U8
తల్లి BALANAGAMMA ను, తండ్రి కార్యవర్థిని అంతఃపురానికి పెద్ద తల్లుల చెంతకు చేర బిలిచాడు. అంతట తండ్రి కార్యవర్థి, నాయనా బాలవ నీ తల్లిని నేను యేలుకోజాలనయ్యా! ఆమె మరాటి వద్ద ఉండి వచ్చింది. బాలవర్థి చిన్నబోయేడు. నా తల్లిని శంకించకయ్యా వ్రతము చెడలేదు నా తల్లి అగ్ని పెట్టు అన్నాడు.నూనె తెప్పించి ఉక్కు తొట్టెలో పోయించి క్రింద కట్టెమోపు మంట పెట్టి, మరుగుచున్న నూనెలో ఉంగరాన్ని వేయించి ఆమె యుంచిన, నొప్పి సలుపులు లేక బొబ్బలెక్కకుండా తీసిన ఏలుకుంటానన్నాడు. క్షణాలపై ఏర్పాటుచేశాడు. BALANAGAMMA నాగేంద్రుని నమస్కరించు కున్నది. తల్లి భూలక్ష్మీదేవిని స్మరించుకున్నది. భర్తపై మనస్సు నిలుపు కున్నది. చేతిని నూనెలో పెట్టి ఉంగరాన్ని నిరపాయంగా తీసింది. నీ తల్లిని నమ్మేనన్నాడు. బాలవర్థి ఆనందంతో పరవశించేడు. నా తల్లి నాకు కీర్తి తెచ్చిందని మురిసిపోయాడు. అక్కలు ఆనందించారు. తప్పట్లు తాళాలు మ్రోగాయి.
దంపతులకు స్నానాలు చేయించారు. సాంబ్రాణి దూపాలువేసారు. తలంబ్రాలు పోసారు. చీనీ చీనాంబరాలు కట్టబెట్టారు. నవరత్న స్వర్ణ భూషణాలు ధరింపచేసారు. పెళ్ళిచేసినంత వేడుకలు జరిపించారు.పూలతోట నుండి మంది మార్బలముతో కోటలో ప్రవేశిస్తున్నబాల .. 3. వర్దిని చూచి ప్రజలు ఆనందంతో పరవశించిపోయారు. విధివీధిని తోరణాలు కట్టారు. బాణాసంచా కాల్చారు. మంగళ వాద్యాలు మారు మ్రోగాయి. నాలుగురోజులు వేడుకలు కోలాహలంగా గడిచిపోయాయి.అయిదవనాడు వెలికివచ్చిన ఫకీరు తన చిలుకను తన కిమ్మని బాలవర్ధిని అభ్యర్ధించాడు. నాగళ్ళపూడి గట్టుకు వెడదాము అక్కడే నీకు చిలుకనిచ్చే తతంగం అన్నాడు.
ఫకీరు సంగును వెంటరమ్మన్నాడు. నీ వద్దకురాను బాలుని చెంతనే ఉంటానన్నది. అక్కడ సమస్త సంపదలనునాకు చూపించు చూపకున్న పక్షిపీకపిసుకుతాను అన్నాడు బాలవర్థి. యేమున్నది గనుక ఉన్నదానినల్లా నీకు చూపిస్తాను అని ఒప్పుకున్నాడు మరాటి.ఇద్దరూ కలిసి నాగళ్ళపూడి గట్టుకు చేరుకున్నారు. బాలవర్థి తన మామగారలగు చిలుకవారి పట్టణ ప్రభువుకు, గంగావారి పట్టణ మహా రాజుకు, పులిరాజుకు వర్తమానాలుపంపి యాభైఒంటెలు, యాభై యేను గులు, రెండు వందలబళ్లు నాగుళ్ళ గట్టునగల మసీదుకు రప్పించాడు. మసీదులో గల సంపదలను వాటిపైన పానుగంటికి పంపించాడు.https://pincodesguide.in/durgabai-deshmukh-is-the-great-freedom-fighter/
నా సర్వస్వం స్వాధీనం చేసుకున్నావు నా చిలుకను నాకిచ్చినట్ల యితే ఊరూరా తిరిగి బిక్షమెత్తుకు బ్రతుకుతానన్నాడు ఫకీరు. నీకివ్వడం కల్ల అన్నాడు. చిలుకను లాక్కొవాలన్న దురాశతో కలబడ్డాడు ఫకీరు. బాలుని చేతిలో చిలకతల, ఫకీరు చేతిలో చిలుక కాళ్ళు పట్టుబడ్డాయి. వాళ్ళిద్దరు పెనుగులాడడంతో చిలక పీక బాలవర్థి పిసికి వేశాడు. పక్షి చచ్చింది. పక్షి చావడమే తడవుగా ఫకీరు నేల కూలిపోయి మరణించాడు.ధనవ్యామోహంలేని బాలవర్థి పానుగంటికి వెడుతున్న బళ్ళును,ఒంటెలను, ఏనుగులను, వెనుకకు రప్పించేడు. బిచ్చమెత్తకు తిరిగేఫకీరులను రావించి వారికి తలా కొంత ధనంఇచ్చేడు. మాయల ఫకీరు సమాధి కట్టించి చుట్టూ పూలతోటలు, పళ్ళమొక్కలు వేయించాడు.
సమాధి వద్ద కోట కట్టించాడు.
బాలవర్థి నాగళ్ళగట్టునుండి పానుగంటి పురానికి చేరుకున్నాడు.పానుగంటి రాజ్యాన్ని వారందరూ వివిధ స్థానాలందుండి పరిపాలించారు. గంటికోటరాజ్యాన్ని పెద్ద తండ్రులగు వర్థి రాజులు ఆరుగురు
పరిపాలించసాగారు. భూచక్రపట్నమును బాలవర్థి తండ్రి కార్యవర్థి పరిపాలించెను. కార్యవర్థి తన అత్తవారిచ్చిన పట్నాలను పరిపాలన చేయుచుండెను.ఈ విధంగా నవాభోజరాజు భూలక్ష్మీ దేవిదంపతుల పుత్రికలువారి భర్తలు నిరాటంకంగా ప్రజా రంజకంగా పరరాజులు బెడద, భయం
లేకుండా రాజ్యాన్ని సురాజ్యంగా పరిపాలించి తరించేరు.
…………………………………………………………………….సమాప్తం………………………………………………………………………….